me too: ‘మీ టూ’ ఉద్యమంపై స్పందించిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్!
- ఆరోపణలపై షాక్ కు గురయ్యా
- చిత్రసీమ సురక్షితంగా ఉండాలనుకుంటున్నా
- మీటూ దుర్వినియోగం అయ్యే ఛాన్సుంది
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్పందించారు. మీటూ ఆరోపణల కింద వెల్లడైన నటులు, కళాకారుల పేర్లు తనను షాక్ కు గురిచేశాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ రోజు ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘మీ టూ ఉద్యమంలో భాగంగా బయటకు వచ్చిన కొన్నిపేర్లు నన్ను షాక్ కు గురిచేశాయి. బాధితులు, నిందితులు.. ఇద్దరికీ ఒకటే చెబుతున్నా. మన చిత్ర పరిశ్రమ నిజాయితీగా, మహిళల్ని గౌరవించే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ధైర్యంగా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన బాధితులకు దేవుడు మరింత శక్తినివ్వాలి.
ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి, విజయవంతం కావడానికి వీలుగా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని నేను, నా బృందం నిర్ణయించుకున్నాం. బాధితులు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని సోషల్ మీడియా కలిగిస్తోంది. ఇంటర్నెట్ లో ఇలాంటి విషయాలను ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వీటిని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది’ అని రెహమాన్ పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ను గాయని చిన్మయి శ్రీపాద రీట్వీట్ చేశారు.