Pakistan: భారత్ తన ఉచ్చులో తానే చిక్కుకునేలా చేస్తాం: పాకిస్థాన్

  • జమ్ముకశ్మీర్ లోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు పాక్ ను అనుమతించని భారత్
  • లేఖ రాసినా, నేరుగా మాట్లాడినా ఫలితం లేదన్న పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్
  • భారత్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగడతామన్ని పాక్ నదీ వనరుల మంత్రి

1960 సింధూ జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రెటీ)కి సంబంధించి భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. జమ్ముకశ్మీర్ లోని రెండు జల విద్యుత్ కేంద్రాలను పాక్ అధికారులు సందర్శించేందుకు భారత్ అనుమతించకపోవడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయద్ మెహర్ అలీ షా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ లోని పాకల్ దూల్, లోయర్ కల్నాయ్ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతిస్తామని ఆగస్టు 29, 30 తేదీలలో జరిగిన సమావేశం సందర్భంగా ఇండియన్ వాటర్ కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే జమ్ముకశ్మీర్ లో అక్టోబర్ లో జరిగిన స్థానిక ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. కానీ, తమ పర్యటన షెడ్యూల్ ను రివైజ్ చేసే విషయంలో భారత్ అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులకు లేఖ రాశామని, తమ అసంతృప్తిని వ్యక్తీకరించామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం నేరుగా ఫోన్ కూడా చేశానని... అయినా సరైన సమాధానం రాలేదని అన్నారు. చీనాబ్ నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టులను తాము పరిశీలిస్తామనే నమ్మకం పోయిందని చెప్పారు.

పాకిస్థాన్ నదీ వనరుల మంత్రి ఫైసల్ వావ్డా మాట్లాడుతూ, భారత్ పై ఎదురుదాడికి తాము దిగబోమని చెప్పారు. అయితే, 1960 ఒప్పందానికి భారత్ ఏ విధంగా తూట్లు పొడుస్తోందనే విషయాన్ని దేశంలో, విదేశీ వేదికలపై ఎండగడతామని తెలిపారు. పాక్ ప్రయోజనాలకు భారత్ కలిగిస్తున్న విఘాతాన్ని ఎత్తి చూపుతామని అన్నారు. భారత్ తన ఉచ్చులో తానే చిక్కుకునే విధంగా అడుగులు వేస్తామని చెప్పారు. 

Pakistan
india
Indus Waters Treaty
Indus Water Commission
Syed Mehr Ali Shah
Minister for Water Resources
Faisal Vawda
  • Loading...

More Telugu News