shivaparvathi: తల్లి పాత్రల్లో రాణిస్తానని కమెడియన్ నాగేశ్ చెప్పారు: నటి శివపార్వతి
- 'సర్పయాగం'లో నాగేశ్ కూడా చేశారు
- కోర్టు సీన్ చేయడానికి టెన్షన్ పడ్డాను
- నాగేశ్ పాదాలకి నమస్కరించాను
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటి శివపార్వతి మాట్లాడుతూ, 'సర్పయాగం' షూటింగులో ఎదురైన ఒక అనుభవం గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు నాగేశ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. శోభన్ బాబు కాంబినేషన్లోనే ఎలా నటించాలిరా బాబూ అని నేను టెన్షన్ పడుతుంటే, 'సర్వర్ సుందరం'తో తన విశ్వరూపం చూపించిన నాగేశ్ కూడా 'సర్పయాగం'లో జాయిన్ అయ్యారు.
ఓ రోజున కోర్టు సీన్ షూటింగు జరుగుతోంది. 'నా బిడ్డను ఉరి తీయండి' అని నేను జడ్జికి మొరపెట్టుకునే సీన్ అది. ఆ సీన్ చేయడానికి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. అప్పుడు నాగేశ్ గారు నన్ను పిలిచి 'అదికాదురా బయట నువ్వు ఎవరు అనే విషయం మరిచిపో .. నీకు ఇచ్చిన కేరక్టర్లోకి వెళ్లిపో' అన్నారు. అప్పుడు ఆయన పాదాలకి నమస్కారం చేసి ఆ షాట్ ను పూర్తిచేశాను. అప్పుడు ఆయన క్లాప్స్ కొట్టి .. నా నుదుటిపై ముద్దు పెట్టి .. ఇండస్ట్రీలో తల్లి పాత్రల్లో రాణిస్తానని ఆశీర్వదించారు" అని చెప్పుకొచ్చారు.