me too: ఓ దర్శకుడు నన్ను లైంగికంగా వేధించాడు.. చెప్పు తీసుకుని కొట్టాను!: నటి ముంతాజ్
- వేధింపులపై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశా
- వాళ్లు సమస్యను పరిష్కరించారు
- ‘మీ టూ’లో ఒక్కరి వాదననే వినడం సరైంది కాదు
భారత్ లో ‘మీ టూ’ ఉద్యమం దెబ్బకు భారత విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పదవి ఊడిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే నటులు నానాపటేకర్, దర్శకుడు సుభాష్ ఘయ్ తమ కీలక ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ఫేమ్ ముంతాజ్ తనకు సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపులను చెప్పుకొచ్చింది.
ఓ మీడియా సంస్థతో ముంతాజ్ మాట్లాడుతూ.. ‘అవును. నాకు అలాంటి చేదు అనుభవాలు చాలా ఉన్నాయి. ఓ దర్శకుడు సినిమా షూటింగ్ సందర్భంగా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే చెప్పు తీసుకుని కొట్టాను. ఈ వ్యవహారంపై నడిగర్ సంఘానికి వెంటనే ఫిర్యాదు కూడా చేశాను. దీంతో వాళ్లు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించారు.
ఈ గొడవ జరిగాక మరోసారి చొరవ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో నేను చెడామడా తిట్టేశా. అప్పటి నుంచి నా జోలికి రావడం మానేశాడు. అంతేకాదు.. ఎప్పుడైనా కనిపిస్తే రండి మేడమ్.. కూర్చోండి మేడమ్.. ఏం తీసుకుంటారు? అని మర్యాదగా ప్రవర్తించేవాడు’ అని తెలిపింది.
మీ టూ ఉద్యమంపై స్పందిస్తూ.. బాధితులు, నిందితులు ఇద్దరి వాదనలను వినాలనీ, ఒక్కరి వాదనలను మాత్రమే వింటే ప్రయోజనం ఉండదని ముంతాజ్ అభిప్రాయపడింది. చాలా సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన ముంతాజ్.. తాజాగా తమిళం బిగ్ బాస్-2లో మరోసారి వెలుగులోకి వచ్చింది.