Rajasthan: 120 మందిలో జికా వైరస్ గుర్తించాం: రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి

  • తగిన చర్యలు తీసుకుంటే వారంలో ఉపశమనం
  • ఆడెస్ అనే దోమలు కుట్టడం వల్ల వైరస్ వ్యాప్తి
  • గర్భిణీలకు వ్యాపిస్తే పలు సమస్యలకు దారి తీసే అవకాశం

రాష్ట్రంలో 120 మందిలో జికా వైరస్‌ను గుర్తించామని రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి కలిచరణ్ సరఫ్ వెల్లడించారు. వీరిలో 105 మంది చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జికా వైరస్‌కు సంబంధించిన అవగాహన కలిస్తున్నామని, వైరస్ సోకిన వారు తగిన చర్యలు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందొచ్చని అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. తగిన విశ్రాంతి, బాగా నీళ్లు తాగడంతో పాటు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు తీసుకుంటే కేవలం వారం రోజుల్లోనే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారని సరఫ్ వెల్లడించారు.

‘ఆడెస్’ అనే దోమలు కుట్టడం వల్ల జికా వైరస్ వ్యాప్తితో పాటు వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. ఈ దోమలు పగటి పూట కుడతాయి. ఈ వైరస్ వ్యాపిస్తే జ్వరం, దద్దుర్లు, కళ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్ వ్యాపిస్తే పిల్లలు కొన్ని లోపాలతో జన్మించే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భిణీల్లో పలు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ముందే ప్రసవం కూడా జరిగే అవకాశాలుంటాయి.

Rajasthan
Zika
Virus
  • Loading...

More Telugu News