China: సముద్రంపై చైనా ముద్ర.. ప్రపంచంలోనే అతి పొడవైన సాగర వంతెన!
- చైనా-హాంకాంగ్-మకావ్‌ను కలుపుతూ నిర్మాణం
- నిర్మాణానికి తొమ్మిదేళ్ల కాలం
- 120 ఏళ్లపాటు సేవలందించేలా జాగ్రత్తలు
ప్రపంచ ఆధిపత్యాన్ని కోరుకుంటున్న చైనా ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. గతంలో భారీ రిజర్వాయర్, ఆ తర్వాత గాజు వంతెన, నిన్నటికి నిన్న కృత్రిమ జలపాతంతో ఆకట్టుకున్న చైనా తాజాగా సముద్రంపై ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన నిర్మించి తన ప్రత్యేకత చాటుకుంది.
చైనా-హాంకాంగ్-మకావ్‌లను కలుపుతూ నిర్మించిన ఈ పొడవాటి వంతెనను ఈనెల 24వ తేదీన ప్రారంభిస్తోంది. ఆరు లేన్ల రహదారితో నిర్మించిన ఈ వంతెన పొడవు 55 కిలోమీటర్లు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే హాంకాంగ్-జువాయ్ మధ్య ప్రయాణ సమయం మూడు గంటల నుంచి కేవలం అరగంటకు తగ్గిపోతుంది.
2009లో ప్రారంభించిన వంతెన నిర్మాణం తొమ్మిదేళ్ల తర్వాత పూర్తయింది. ఈ వంతెనపై రోజూ దాదాపు 29,100 వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా. ఇప్పటికే వంతెనపై ప్రయాణించేందుకు ఐదు వేల ప్రైవేటు కార్లకు చైనా రవాణా శాఖ అనుమతిచ్చింది. దాదాపు 120 ఏళ్లపాటు సేవలందించే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం, సుమారు 60 ఈఫిల్ టవర్ల నిర్మాణం కోసం అవసరమయ్యే ఉక్కును వినియోగించారు. మలుపు తిరిగిన రహదారి క్రాసింగ్‌లు, సముద్రంలోకి సొరంగ మార్గం నిర్మాణం ఈ పాజ్రెక్టు ప్రత్యేకతలు!