Sabarimala: దర్శనానికి ప్రయత్నించింది 8 మంది మహిళలే... ఒక్కరికీ దర్శనం కాలేదన్న శబరిమల దేవస్థానం... రేపు ఆలయం మూత!
- నాలుగు రోజుల క్రితం తెరచుకున్న అయ్యప్ప ఆలయం
- స్వామిని దర్శించుకునేందుకు మహిళల విఫలయత్నం
- ఎవరు వచ్చినా అడ్డుకున్న భక్తులు
- అందరికీ భద్రత ఇచ్చి క్షేమంగా పంపించామన్న పోలీసులు
నాలుగు రోజుల క్రితం మాస పూజల నిమిత్తం శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకోగా, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు 8 మంది మాత్రమే దేవుడిని దర్శించే ప్రయత్నం చేశారని, వారిలో ఒక్కరు కూడా స్వామిని ప్రత్యక్షంగా చూడలేదని ఆయల వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వసంతి (41), ఆదిశేషి (42) పంబ బేస్ క్యాంప్ నుంచి శబరిమలకు బయలుదేరగా, ఆలయానికి 200 మీటర్ల దూరంలో వారిని అడ్డుకున్న భక్తులు తీవ్ర నిరసనలు తెలుపగా, వారిద్దరూ వెనుదిరిగారు. నిన్న కేరళకు చెందిన 38 ఏళ్ల మహిళకు కూడా ఇదే విధమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.
అంతకుముందు ఎర్నాకులానికి చెందిన రెహానా, హైదరాబాద్ జర్నలిస్టు కవితలు భారీ బందోబస్తు మధ్య ఆలయం పరిసరాల్లోకి వెళ్లినప్పటికీ, స్వామిని మాత్రం దర్శించుకోలేక పోయారు. ఇక్కడికి వచ్చిన మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తూ, వారు సురక్షితంగా వెనుదిరిగేలా చూస్తున్నామని శబరిమలలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు అంటున్నారు. కాగా, రేపు శబరిమల ఆలయం మూతపడనుంది. ఆపై మండల పూజ నిమిత్తం నవంబర్ 16న తెరచుకునే ఆలయంలో డిసెంబర్ చివరి వారం వరకూ పూజలు జరగనున్నాయి.