Andhra Pradesh: ఓవైపు జగన్ కోర్టుకు వెళ్లగానే.. విమర్శలు చేసేందుకు జీవీఎల్ ఢిల్లీ నుంచి వాలిపోతున్నారు!: మంత్రి నక్కా ఆనందబాబు
- కన్నాకు వైసీపీ నేతలతో సంబంధాలు
- ఆయన జీవితం ఏంటో ప్రజలకు తెలుసు
- కేంద్రం అండతోనే జగన్ పై కేసులు నిర్వీర్యం
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు మూడు ముక్కలాట ఆడుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. శుక్రవారం జగన్ కోర్టు పనిమీద ఉంటే, ఆ లోటును పూడ్చడానికి బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రాష్ట్రానికి వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కుట్రలో ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్, బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ తమవంతు పాత్రను షోషిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడారు.
కన్నా లక్ష్మీ నారాయణ రాజకీయ జీవితం ఏంటో గుంటూరు ప్రజలకు బాగా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీలో చేరబోయి చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయారు? అన్న ప్రశ్నకు కన్నా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ-వైసీపీ రహస్య ఒప్పందంలో భాగంగానే కన్నాకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. వైసీపీ జెండాను జేబులో పెట్టుకున్న కన్నా.. బీజేపీలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు వైసీపీ నేతలతో వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు.
కేంద్రం అడ్డుకోవడం కారణంగానే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కేసులు ముందుకు కదలడం లేదని నక్కా ఆనందబాబు విమర్శించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ-వైసీపీ-జనసేన కుట్రలను తిప్పికొట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మోదీని ప్రశ్నించి, నిలదీయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనని మంత్రి స్పష్టం చేశారు.