Anantapur District: రైలు ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం...పెళ్లయిన ఐదు రోజులకే విషాదం!

  • అనంతపురం జిల్లా ధర్మవరం మండల కేంద్రంలో ఘటన
  • రైలు ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం
  • మృతుడు కామిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి

పెళ్లయిన ఐదు రోజులకే అల్లుడు దుర్మరణం పాలవ్వడంతో అత్తారింట విషాదం నెలకొంది. దసరా పండుగకు అల్లుడు, కూతురు వచ్చారన్న సంతోషం వారికి ఎంతోసేపు మిగల్లేదు. రైలు ప్రమాదం రూపంలో మృత్యువు అల్లుడిని కబళించడంతో పండగ జరుపుకోవాల్సిన ఇంట చావుబాజా మోగింది. రెండు కుటుంబాల్లో అంతులేని విషాదానికి కారణమైన ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండల కేంద్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే...ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన బాలగొండ నాగరాజు (32)కు, మండలంలోని వసంతపురానికి చెందిన లక్ష్మితో ఐదు రోజుల క్రితం పెళ్లయింది.  నాగరాజు దసరా పండుగకు అత్తారింటికి వెళ్లాడు. గురువారం కాలినడకన రైల్వేట్రాక్‌పై ధర్మవరానికి వస్తుండగా గొల్లపల్లి వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లోనూ పెను విషాదానికి కారణమైంది.

నాగరాజుకు వినికిడి సమస్య ఉందని, ఈ కారణంగానే రైలు రాకను గుర్తించలేక పోయాడని పోలీసులు చెబుతున్నారు. పెళ్లయిన ఐదు రోజులకే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న లక్ష్మిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఘటనా స్థలిని పోలీసులు సందర్శించారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Anantapur District
dharmavaram
man dead in accident
  • Loading...

More Telugu News