punjab: రైలు ప్రమాదానికి అసలు కారణాలు ఇవే..!
- పటాకుల నిప్పు రవ్వలు మీద పడడంతో పట్టాలపైకి చేరుకున్న ప్రజలు
- మైకుల మోత, బాణసంచా పేలుళ్ల శబ్దం
- కూతపెట్టని రైలు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దసరా పండుగ వేళ జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనక ఉన్న కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై మృత్యువులా దూసుకొచ్చిన రైలు ఏకంగా 60 మందిని బలితీసుకుంది. 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
రావణ దహనాన్ని పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకుంటున్న రైలు కొంచెం కూత పెట్టినా ప్రమాద తీవ్రత తగ్గేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు, రైలు వస్తున్న విషయాన్ని గుర్తించిన కొందరు పక్క ట్రాక్‌పైకి వెళ్లాలని భావించారు. అయితే అటునుంచి మరో రైలు రావడంతో వారికి మరో మార్గం కనిపించలేదని చెబుతున్నారు. అయితే, ఆ రైలు అప్పటికే వెళ్లిపోయిందని మరికొందరు చెబుతున్నారు. కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించారని, అందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ప్రమాదానికి కారణమైన డీఎంయూ 74943 రైలు ఆ ప్రాంతవాసులకు చిరపరిచతమే. హోషియాపూర్ నుంచి జలంధర్ వెళ్లే ఈ రైలులో చాలామంది స్వర్ణదేవాలయానికి వెళ్తుంటారు. ఈ రైలు సమయం అందరికీ తెలుసు. సాయంత్రం 6:50 గంటలకు జోడాపాఠక్‌కు చేరుకుంటుంది. అయితే, దసరా రోజున రైళ్లు ఈ ప్రాంతం గుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. దీంతో జనాలు భయం లేకుండా ట్రాక్‌లు దాటుతుంటారు. ప్రమాద సమయంలో మైకుల్లో పాటలు హోరెత్తుతుండడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు.
రావణ దహనం సందర్భంగా పేలుతున్న పటాకుల నిప్పు రవ్వలు ఎగిరి పడుతుండడంతో అందరూ దూరంగా జరిగి పట్టాలపైకి చేరుకున్నారు. మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ బిజీ అయిపోయారు. బాణసంచా పేలుడు తప్ప వారికి రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు. మరోవైపు రైలు కూడా హారన్ మోగించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో రైలు వారి నుంచి దూసుకుపోయింది. 15 సెకన్ల వ్యవధిలోనే పెను ప్రమాదం జరిగిపోయింది.