Chandrababu: పవన్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నారు.. జగన్ పాదయాత్రకు జనాల స్పందనే లేదు: చంద్రబాబు
- జనసేన, బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లు మనల్ని టార్గెట్ చేస్తున్నాయి
- వాళ్ల తిట్లే మనకు ప్రజా దీవెనలు
- జగన్ మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం దక్కదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు ఒక్క బీజేపీ నేత కూడా రాలేదని ఆయన మండిపడ్డారు. బాధితులను తాను పరామర్శిస్తుంటే... వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి, అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు.
పవన్ కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నారని విమర్శించారు. జనసేన, బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లు టీడీపీని టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. ఇదంతా మన మంచి కోసమేనని చెప్పారు. వాళ్లు తిట్టే తిట్లే తమకు ప్రజా దీవెనలని చెప్పారు. పార్టీ కేడర్ మొత్తం ఇంకా కష్టపడాలని... అప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుందని అన్నారు. పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తుపాను బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ప్రజలంతా గుర్తించారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఇతర పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. ప్రజలకు మనల్ని దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో సంతృప్తి 57 శాతం నుంచి 76 శాతానికి పెరిగిందని చెప్పారు.
జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందనే కరవైందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అతని ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదని చెప్పారు. జగన్ ది చిత్తశుద్ధితో కూడిన పాదయాత్ర కాదని... డ్రామా పాదయాత్ర అని అన్నారు. మరో నాలుగేళ్ల పాటు జగన్ నడిచినా... అతనికి ఫలితం దక్కదని చెప్పారు.