: నేను తిట్టడం మొదలుపెడితే తట్టుకోలేరు: కడియం
తెలుగుదేశం పార్టీని వీడిన సీనియర్ నేత కడియం శ్రీహరి ఎదురుదాడికి దిగారు. తాను విమర్శలకు పదునుపెడితే తట్టుకోలేరని హెచ్చరించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, తనను రాజకీయ వ్యభిచారి అనడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మహానాడులో తెలంగాణ ప్రస్తావన లేదెందుకని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో బాబుతో స్పష్టత ఇప్పించాలని అన్నారు.
కాగా, పార్టీ సాయంతో ఎదిగి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో.. టీడీపీ ఇబ్బందుల్లో ఉన్పప్పుడు కూడా పార్టీ మారలేదని తెలిపారు. టీడీపీలో భావదారిద్ర్యం నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యభిచారి అనడం అది వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. పైగా, తాను దళితుడిని కాదని వ్యాఖ్యానించడం మోత్కుపల్లికి తగదని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావుది తమది ఒకే ఊరని, కావాలంటే తన కులమేదో ఎర్రబెల్లిని అడిగి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక, స్టేషన్ ఘన్ పూర్ లో టీడీపీ కార్యకర్తల కోసం వెతుకుతున్నా ఒక్కరూ కనిపించడంలేదని ఎద్దేవా చేశారు.