vijay devarakonda: తొలిసారిగా ఎవరికి, ఎప్పుడు ముద్దుపెట్టానంటే.. రానా షోలో బయటపెట్టిన విజయ్ దేవరకొండ!
- నంబర్ 1 యారీ కార్యక్రమానికి హాజరు
- పలు అంశాలపై ముచ్చటించిన విజయ్
- ముద్దుల విషయంలో రానా తర్వాతే తానని వ్యాఖ్య
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘నంబర్ 1 యారీ’ కార్యక్రమానికి హాజరైన విజయ్ తన వ్యక్తిగత జీవితం, అలవాట్లు, మధురానుభూతులను పంచుకున్నాడు. ఈ సందర్భంగా గీత గోవిందం సినిమాలో రష్మికతో ముద్దుల సీన్లు సినిమా రిలీజ్ కు ముందు లీక్ కావడంపై స్పందించాడు.
ఈ సందర్భంగా మొదటి ముద్దు ఎప్పుడు, ఎవరికి పెట్టావ్? అన్న రానా ప్రశ్నలకు విజయ్ తెగ ఇబ్బందిపడిపోయాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి ఓ అమ్మాయికి ముద్దు పెట్టాను. నా కాలేజీ చదువంతా అబ్బాయిల కాలేజీలోనే సాగింది. దీంతో అమ్మాయిలతో చనువుగా ఉండటం ఎలాగో తెలియలేదు. అయితే ప్రస్తుతం నా దర్శక నిర్మాతల కారణంగా ఇప్పుడు ఆ లోటు తీరుతోంది’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఏదేమయినా ఈ ముద్దుల వ్యవహారంలో రానా తర్వాతే తానుంటానని విజయ్ అన్నాడు.