shabarimala: శబరిమలలో 144 సెక్షన్.. కొనసాగుతున్న బంద్
- శబరిమల సంరక్షణ సమితి పిలుపు మేరకు ఈరోజు హర్తాళ్
- వీహెచ్పీ కూడా బంద్ కు పిలుపు
- మద్దతు తెలిపిన బీజేపీ
శబరిమలలో అయ్యప్పస్వామికి నెలవారీ పూజల నిమిత్తం నిన్న ఆలయం తెరిచారు. భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి బయలుదేరిన మహిళా భక్తులను నిన్న ఆందోళనకారులు అడ్డుకోవడం తెలిసిందే. కనీసం, పంబ నది వరకు కూడా మహిళలను ఆందోళనకారులు రానివ్వలేదు.
దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో శబరిమల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఈరోజు కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు అనుమతిని నిరాకరిస్తూ శబరిమల సంరక్షణ సమితి 24 గంటల హర్తాళ్ కు పిలుపు నిచ్చింది. శబరిమల సంరక్షణ సమితితో పాటు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) కూడా బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు బీజేపీ మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ నెల 22 వరకు శబరిమల ఆలయం తెరచి ఉంటుంది. అయ్య ప్పభక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చు.