Tirupati: నా మూడో భర్త మోసం చేశాడు: పోలీసుల విచారణలో నౌహీరా
- అమాయకుల నుంచి వందల కోట్ల వసూలు
- పెట్టుబడిదారుల్లో 90 శాతం ముస్లింలే
- పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరాకు డాక్టరేట్
- మరింత లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు
ఆదాయపు పన్ను శాఖకు, ప్రభుత్వానికి తెలియకుండా, అమాయకులైన ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన నౌహీరాను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆమె గురించిన మరింత సమాచారాన్ని రాబట్టారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలు రాష్ట్రాలకు విస్తరించిన ఆమె, పోలీసుల విచారణలో, తనను తన మూడో భర్త మోసం చేశాడని చెబుతుండటం పోలీసు వర్గాలను విస్మయ పరుస్తోంది.
ఇక నౌహీరా నేపథ్యాన్ని పరిశీలిస్తే, తిరుపతికి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి కుమార్తె నౌహీరా. కేవలం 10వ తరగతి వరకూ చదువుకున్న నౌహీరాకు, చిన్న వయసులోనే మరో కూరగాయల వ్యాపారితో వివాహం జరిగింది. ఆపై అతన్ని వదిలేసిన ఆమె, మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతన్ని కూడా వదిలించుకుంది.
తన తెలివితేటలను పెట్టుబడిగా పెడుతూ, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ వచ్చింది. దుబాయ్ యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ఇచ్చిందని చెబుతూ, ప్రకటనలు ఇచ్చుకుంది. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించి, 15 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుని తన దందాను సాగించింది. ఈ క్రమంలో ఆమె మరో వివాహం చేసుకుంది.
రూ. లక్ష పెట్టుబడిగా పెడితే, నెలకు రూ. 3,300 వడ్డీ ఇస్తానని పేదలకు ఆశ చూపింది. తన సంస్థలో వాటాలు ఇస్తానని బాండ్ రాసిచ్చింది. నెలనెలా సక్రమంగా వడ్డీ పడుతూ ఉండటంతో, ప్రజలు ఆమె వలలో పడ్డారు. రూ. 2 వడ్డీపై అప్పు తెచ్చి మరీ ఆమె సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆమె కస్టమర్లలో 90 శాతం మంది ముస్లింలే ఉండటం గమనార్హం. ఆమెను మరింత లోతుగా విచారించాల్సి వుందని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు.