Jagan: వైసీపీ నేతలకు మానవత్వం లేదు: సీఎం చంద్రబాబు
- శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
- తుపాన్ బాధితులకు సహాయక చర్యలపై ఆరా
- పక్క జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కు ప్రజా సమస్యలు తెలియవా?
వైసీపీ నేతలకు మానవత్వం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. పక్క జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ప్రజల సమస్యలు తెలియవా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. బాధితులకు సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘తిత్లీ’ సహాయక చర్యల నేపథ్యంలో గట్టిగా చెప్పి పనులు చేయిస్తున్నానని, మాట వినకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారాన్ని అందజేస్తామని, ఉద్దానం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. తుపాను బాధితుల కోసం సేకరించిన విరాళాలతో చేసిన పనులకు ఆయా దాతల పేర్లు పెడతామని చెప్పారు.
తిత్లీ తుపాన్ ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపు నిచ్చారు. విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు బీచ్ రోడ్డును అభివృద్ధి చేసి జాతీయ రహదారికి అనుసంధానిస్తామని, తద్వారా శ్రీకాకుళం జిల్లా బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.