afghanistan: ఎంపీ అభ్యర్థి సీటు కింద బాంబుపెట్టి లేపేశారు.. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ఘాతుకం!
- ఏడుగురు నేతలకు తీవ్రగాయాలు
- దాడిని తామే చేశామన్న తాలిబన్లు
- ఎన్నికలకు బహిష్కరించాలని పిలుపు
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థి సీటు కింద బాంబు పెట్టి హతమార్చారు. ఈ ఘటన హెల్మెండ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో పార్లమెంటుకు పోటీ చేస్తున్న అబ్దుల్ జబర్ ఖహ్రామన్ అక్కడికక్కడే చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాబోయే ఎన్నికలను బహిష్కరించాలని తాలిబన్లు ఇప్పటికే పిలుపునిచ్చారు.
అమెరికా అండగా కొనసాగుతున్న ఆఫ్గన్ తోలుబొమ్మ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ హెచ్చరికను కాదన్నందుకు ఖహ్రోమన్ పై దాడి జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గత రెండు వారాల్లో ఆఫ్గనిస్తాన్ లో ఎన్నికల్లో పోటీచేస్తున్న 10 మంది అభ్యర్థులను తాలిబన్లు కిరాతకంగా హతమార్చారు. అంతేకాకుండా ఓ ర్యాలీ లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.