Odisha: ఒడిశాలో తుపాను సమయంలో పుట్టిన ‘తిత్లీ’!
- బీభత్సమైన తుపాను సమయంలో పుట్టిందని తల్లిదండ్రులు తిత్లీగా నామకరణం
- జోరు వాన కురుస్తుండగా ప్రసవం
- గుర్తుగా ఉంటుందని ఆ పేరు సూచించిన పాప తాతగారు
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను బీభత్సం ఓ కుటుంబానికి మాత్రం తీపి గుర్తును పంచింది. హోరుగాలి, జోరు వానలో ఆ కుటుంబంలోని మహిళ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో గుర్తుగా ఆ పాపకు తల్లిదండ్రులు ‘తిత్లీ’ అని నామకరణం చేసి పొంగిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే...తుపాను బీభత్సంతో ఒడిశాలోని మిడ్నాపూర్ ప్రాంతం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడి తుపాన్‌గంజ్ ప్రాంతంలోని ప్రదీప్ తమయ్, ఇషితాదాస్‌లు దంపతుల ఇంట హడావిడి. ఎందుకంటే ఇషితాదాస్ నిండుగర్భిణి. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో ఇండియన్ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రదీప్ ఆనందంతో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 12వ తేదీన బీభత్సమైన గాలులు, భారీ వర్షం కురుస్తుండగా 31 ఏళ్ల ఇషితాదాస్‌కు నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఓ నర్సింగ్‌హోంకు తరలించారు. బీభత్సమైన గాలులకు విరిగి పడుతున్న చెట్లు, ఎగిరి పడుతున్న ఇంటి పైకప్పులను చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరికి ఇషితాదాస్‌కు సుఖప్రసవం అయి పండంటి ఆడ పిల్లకు జన్మనివ్వడంతో పొంగిపోయారు. తుపాను బీభత్సంలో మనవరాలు పుట్టడంతో ఆమెకు తిత్లీగా పేరు పెట్టాలని తండ్రి (పాప తాత) సూచించడంతో ప్రదీప్ కుమార్తెకు అదే పేరు పెట్టారు.