kcr: తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లకు శని చంద్రబాబు!: కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
- ‘ఆంధ్రావాళ్లు’ అనే వివక్ష ఏనాడూ చూపలేదు
- బాబు మళ్లీ అపోహలు సృష్టిస్తున్నారు
- చంద్రబాబు ఇక్కడ రాజ్యాలేలతాడా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన దైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత నాలుగున్నరేళ్లలో ‘ఆంధ్రావాళ్లు’ అనే వివక్ష ఏనాడూ చూపలేదని, మళ్లీ చంద్రబాబునాయుడు ఇక్కడ అడుగుపెట్టడంతోనే ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
‘చంద్రబాబు అనే ఉడుం రాకముందు గత నాలుగున్నరేళ్లలో ఈ సమస్య వచ్చిందా? తెలంగాణలో అటువంటి వాసన ఉందా? ఇదే చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ‘మీ ఆస్తులు గుంజుకుంటారు.. తరిమికొడతారు’ అని గతంలో ప్రచారం చేశారు. ఎవరైనా తరిమికొట్టారా? ఎన్ని అపోహలు సృష్టించారు?.. ఈరోజు మళ్లీ దుర్మార్గమా? ఆంధ్రా, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్లందరూ మంచిగా బతుకుతున్నారు.
అసలు, ఆంధ్రావాళ్లన్న వివక్ష, భేదం ఉందా? ఎక్కడైనా ఆ మాట వచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎంత గొప్పవాళ్లు. తెలంగాణ సమాజంలో అలాంటిది లేదు. చిల్లర రాజకీయ అవసరాల కోసం కొర్రాయి పెట్టి.. అపోహలు చేస్తావా? ఇక్కడ నా ఆంధ్రావాళ్లను అపోహలకు గురిచేస్తావా? ఎంత దుర్మార్గం? చంద్రబాబునాయుడు ఇక్కడ రాజ్యాలేలతాడా? అసలు డిపాజిట్లు వస్తాయా? ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయావు.. ఇంకా, సిగ్గూబుద్ధీ రావద్దా? నిజంగా, ఆంధ్రావాళ్ల మీద మాకు దుర్మార్గపు భావనే ఉంటే, ఈ నాలుగేళ్లలో ఎన్నిగడబిడలయ్యేవి? నీ (చంద్రబాబు) వాగ్గానం నెరవేర్చ లేదు, నీ మేనిఫెస్టో అమలు చేయలేదు.. ఇక, ఈడొచ్చి ఎలగబెడతావా? తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్లకు శని చంద్రబాబునాయుడు’ అని మండిపడ్డారు.