kcr: అమలుకు వీలయ్యే అంశాలనే ప్రజలకు చెబుతాం: సీఎం కేసీఆర్
- ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం
- రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉంది
- వచ్చే ఐదేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తాం
ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలనే ప్రజలకు చెబుతామని, ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రణాళిక కమిటీకి వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించామని చెప్పారు.
రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉందని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాతే పథకాలు ప్రారంభించామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని, తెలంగాణకు సమకూరే ఆదాయాన్ని బట్టే పథకాలు ఉంటాయని అన్నారు. చెప్పింది తప్పకుండా అమలు చేస్తామని, ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా అదనంగా రాలేదని స్పష్టం చేశారు.