Bonda Uma: కనకదుర్గమ్మ సన్నిధిలో బొండా ఉమకు అవమానం... అలిగి వెళ్లిపోయిన వైనం!

  • టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న బొండా ఉమ
  • నేడు దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
  • ఉమ రాకుండానే జరిగిపోయిన కార్యక్రమం
  • తనను అవమానించారంటూ వెళ్లిపోయిన ఉమ

ఈ ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో తెలుగుదేశం నేత, టీటీడీ పాలక మండలి సభ్యుడు బొండా ఉమకు అవమానం జరుగగా, ఆయన అలిగి వెళ్లిపోయారు. నేడు టీటీడీ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించాల్సి వుండగా, బొండా ఉమ ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటారని నిన్ననే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఈ ఉదయం టీటీడీ అసిస్టెంట్ ఈఓ సాయి వస్త్రాలను తీసుకుని రాగా, ఆలయ ఈఓ కోటేశ్వరమ్మ, ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. దుర్గగుడి అధికారుల తీరుపై పక్కనే ఉన్న బోర్డు సభ్యుడు ధర్మారావు అభ్యంతరం చెబుతూ, ఉమ వచ్చేంతవరకూ ఆగాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తాను వస్తున్నానని తెలిసి కూడా పట్టించుకోలేదని, ప్రొటోకాల్ ను పక్కనబెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అంటూ బొండా ఉమ కొండదిగి వెళ్లిపోయారు. ఆపై కోటేశ్వరమ్మ స్పందిస్తూ, ఈ కార్యక్రమానికి బొండా ఉమ వస్తున్నట్టు తనకు ఎటువంటి సమాచారమూ అందలేదని, తాను నిబంధనల మేరకే నడుచుకున్నానని స్పష్టం చేశారు. సారె తీసుకువచ్చిన వారిని గౌరవంగా తీసుకెళ్లామని ఆమె అన్నారు.

Bonda Uma
Vijayawada
Kanakadurga
TTD
  • Loading...

More Telugu News