Chiranjeevi: కాంగ్రెస్ కు పూర్తిగా గుడ్ బై చెబుతున్న చిరంజీవి!
- ముగిసిపోయిన కాంగ్రెస్ సభ్యత్వ కాలపరిమితి
- సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోని చిరంజీవి
- రాహుల్ కోరినా స్పందించని మెగాస్టార్
తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో అధికారాన్ని పొందలేక, ఆపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగానూ పని చేసిన ఆయన, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే.
తన 150వ చిత్రంగా 'ఖైదీ నం. 150'తో వచ్చిన ఆయన, ప్రస్తుతం 'సైరా' చేస్తున్నారు. ఆపై కొన్ని చిత్రాలను వరుసగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక, చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా, ఆయనింకా దాన్ని పునరుద్ధరించుకోలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రంగంలోకి దిగాలని రాహుల్ గాంధీ, స్వయంగా కోరినా, చిరంజీవి స్పందించలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.