Kohinoor Diamond: కోహినూర్ వజ్రంపై ప్రభుత్వం.. ఆర్కియాలాజికల్ సర్వే పొంతనలేని మాటలు!
- కోహినూర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారన్న ప్రభుత్వం
- కాదు, విక్టోరియా మహారాణికి సరెండర్ చేశారన్న ఏఎస్ఐ
- లాహోర్ ఒప్పందంలో భాగంగానే జరిగిందని వివరణ
కోహినూర్ వజ్రం విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతున్న దానికి మధ్య పొంతన కుదరడం లేదు. కోహినూర్ వజ్రాన్ని ఎవరూ దొంగిలించలేదని, బలవంతంగా దేశం నుంచి ఎవరూ తీసుకెళ్లలేదని 2016లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అప్పట్లో పంజాబ్‌ను పాలించిన మహారాజా రంజిత్ సింగ్ వారసులు దానిని ఈస్టిండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని పేర్కొంది.
తాజాగా, సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బదులిస్తూ లాహోర్ మహారాజు కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి సరెండర్ చేశాడని తెలిపింది. ప్రభుత్వ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. ఆంగ్లో-సిక్ యుద్ధం కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మహారాజా రంజిత్ సింగ్ బంధువు ఒకరు కోహినూర్ వజ్రాన్ని ‘స్వచ్ఛంద పరిహారం’ కింద బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు పేర్కొంది.
కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి బహుమానంగా ఇచ్చారా? లేక, ఇంకేదైనా కారణం ఉందా? అన్న ప్రశ్నకు ఏఎస్ఐ ఈ విధంగా స్పందించింది. తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం.. 1849లో లార్డ్ డల్హౌసీ-మహారాజా దులీప్ సింగ్ మధ్య లాహోర్ ఒప్పందం జరిగిందని, దీంతో కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ రాణికి ఆయన సరెండర్ చేశాడని తెలిపింది.