Chandrababu: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వ్యక్తిని మంత్రిని చేశారు: లోకేశ్ పై పవన్ విసుర్లు
- లోకేష్ కు ఏం తెలుసని ఆ శాఖకు మంత్రిని చేశారు?
- పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
- పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే మా సత్తా నిరూపిస్తాం
పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి గెలవలేని వ్యక్తిని పంచాయతీ రాజ్ మంత్రిని చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ కు ఏం తెలుసని ఆ శాఖకు మంత్రిని చేశారు? అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించనందువల్లే కేంద్ర నిధులు వెనక్కి వెళ్తున్నాయని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే ఉప సర్పంచ్ లతో కలిసి ఆందోళనకు దిగుతామని పవన్ హెచ్చరించారు.
పరిశ్రమలతో ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తున్నారని,
ఇప్పటికి ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
విదేశీ కంపెనీలను తీసుకురావడం కాదని, రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను పట్టించుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఉద్యోగ భద్రత కోసం పింఛన్ అందిస్తారని, అటువంటి పింఛన్ సొమ్మును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారని విమర్శించారు.
జనసేన పార్టీ అధికారంలోకొస్తే సీపీఎస్ రద్దు చేస్తామని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపుతామని, అసంఘటిత కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకొస్తే తొలిసంతకం సీపీఎస్ రద్దు ఫైల్ పైనే చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పద్నాలుగేళ్ల వయసులోనే తాను నిర్ణయం తీసుకున్నానని, ప్రజలు తమకు అండగా నిలబడితే అన్ని సీట్లు గెలిచి చూపిస్తామని పవన్ పేర్కొన్నారు.