Andhra Pradesh: ఓ ఉద్యమ ద్రోహి మమ్మల్ని మోసం చేశాడు.. ఏవోబీలో ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల ఆడియో టేపు విడుదల!
- మీనా సజీవంగా దొరికినా చంపేశారు
- గిరిజనులను చిత్ర హింసలు పెడుతున్నారు
- బంధువులను మావోలంటూ ఎత్తుకుపోతున్నారు
ఇటీవల ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మహిళా మావోయిస్టు నేత మీనాను భద్రతా బలగాలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనపై ఆడియో టేపును విడుదల చేశారు. ఓ ఉద్యమ ద్రోహి కారణంగానే మీనా పోలీసులకు దొరికిపోయిందని మావోయిస్టుల ప్రతినిధి కైలాసం ఆరోపించారు. ఆమెను సజీవంగా పట్టుకున్న పోలీసులు అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మీనా మరణం ఉద్యమానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.
ఆంధ్రా-ఒడిశా బోర్డర్(ఏవోబీ)లో ఉన్న ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని ఆరోపించారు. అమాయకులపై మావోయిస్టులనే ముద్ర వేసి నకిలీ ఎన్ కౌంటర్లు చేస్తున్నారని వెల్లడించారు. పండుగలు, సెలవులకు బంధువుల ఇళ్లకు వచ్చేవారిని మావోయిస్టులని చెబుతూ ఎత్తుకుపోతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసుల అరాచకాలను అడ్డుకున్న పేద గిరిజనులు, ఆదివాసీలపై బాష్పవాయువును ప్రయోగించారని మండిపడ్డారు.