aravinda sametha: 'అరవింద సమేత' కథ నాదే: రచయితా వేంపల్లి గంగాధర్ ఆరోపణ
- 'హిరణ్య రాజ్యం' పుస్తకంలోని కథనాన్ని హీరోయిన్ పాత్రకు వాడుకున్నారు
- సినిమా కథకు పునాది నా 'మొండికత్తే'
- ఇతర పాత్రలను దొంగిలించి కొత్త కథను వండడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు
ఎన్టీఆర్, పూజా హెగ్డేల కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అరవింద సమేత' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. అయితే ఈ కథ తనదేనంటూ వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి సాక్షాధారాలతో సహా బయటపెట్టాడు. ఏప్రిల్ 15న త్రివిక్రమ్ నుంచి తొలిసారి తనకు ఫోన్ వచ్చిందని, ఆయన పిలుపు మేరకు హుటాహుటిన రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లానని చెప్పాడు. అప్పటికే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారని చెప్పాడు.
షాట్ గ్యాప్ లో త్రివిక్రమ్ తో పరిచయం అయిందని... తాను రాసిన పుస్తకాల గురించి త్రివిక్రమ్ తెలుసుకున్నారని గంగాధర్ తెలిపాడు. రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై పరిశోధన చేసి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం విని, తనను అభినందించారని చెప్పాడు. తన 'హిరణ్య రాజ్యం' పుస్తకంలోని కథనాన్ని హీరోయిన్ పాత్రకు వాడుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారని తెలిపారు.
తన 'పాపాగ్ని' కథల్లో ఉన్న 'మొండి కత్తి' నేపథ్యం గురించి తెలుసుకున్నారని... కథకు పునాది మొండి కత్తేనని గంగాధర్ చెప్పాడు. త్రివిక్రమ్ ను కలిసి, తన కథల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పని అన్నాడు. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడని, రకరకాల కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగిలించి కొత్త కథను అల్లగలడని చెప్పారు. అలా వండిన మరో కథే 'అరవింద సమేత' అని చెప్పారు.