New Delhi: ఢిల్లీకి తిరిగొచ్చిన కాలుష్య భూతం... ఎమర్జెన్సీ ప్లాన్ అమలు!

  • ఢిల్లీలో అధ్వానంగా వాయునాణ్యత
  • శ్వాస తీసుకునేందుకు ప్రజల ఇబ్బందులు
  • రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

చలికాలంలో దేశ రాజధానిని వణికించే పొగమంచు ఇప్పుడు మరోసారి కమ్మేసింది. ఇప్పటికే వాయు నాణ్యతా సూచి అధ్వాన స్థాయికి చేరింది. దీంతో సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ను నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. న్యూఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల స్థాయికి పడిపోయింది. ఆదివారం నాడు ఉదయం 10 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ 201గా నమోదైందని కాలుష్య నియంత్రణా సంస్థ ప్రకటించింది.

ఢిల్లీకి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పొలాల్లో రైతులు పంట చేతికందిన తరువాత, దాన్ని తగులబెడుతుంటే, ఆ పొగలు దట్టమైన కాలుష్య మేఘాలుగా మారి ఢిల్లీని చుట్టుముడతాయన్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానాల రైతులు పొలాల్లో చెత్తను తగులబెట్టడం, దీపావళి టపాకాయలు కాల్చడం వంటి చర్యల కారణంగా న్యూఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. ఇప్పటికే నాసా తీసిన చిత్రాల్లో వరి గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలు కనిపించాయి.

ఇరుగు, పొరుగున ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాలుష్యంపై ఇప్పటికే చర్చించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కేంద్రంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్టాలతో ఈ విషయమై మాట్లాడామని, ఈ విషయంలో రైతులను ఏమీ అనలేని స్థితిలో ఉన్నామని అన్నారు. నగర ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వాయు నాణ్యతను పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, డీజిల్ జనరేటర్లను ఆపివేయడం, మెట్రో రైలు సర్వీసులను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అవసరాన్ని బట్టి, పాఠశాలలకు సెలవులు ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

New Delhi
Air Quality
Pollution Control Board
Aravind Kejriwal
  • Loading...

More Telugu News