Chandrababu: కుటుంబంతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
- సీఎంకు ఆలయ మర్యాదలతో స్వాగతం
- ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు దంపతులు
- పర్యాటకంగా గుడి పరిసరాల అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు కుటుంబ సమేతంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. మూల నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలు జరుగుతున్న తీరు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం అధికారుల్ని ఆరా తీశారు.
ఈ సందర్భంగా రాష్ట్రాన్ని చల్లగా చూడాలని.. వర్షాలు బాగా కురవాలని.. రైతులతో పాటు ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఏటికేడు పెరుగుతోందని.. గుడి పరిసరాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న తన సంకల్పానికి అమ్మవారి దీవెనలు కోరినట్లు తెలిపారు. తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా దెబ్బతిందని.. అక్కడి సహాయ కార్యక్రమాల నుంచి నేరుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నానని ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, ఛైర్మన్ గౌరంగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.