MJ Akbar: 'మీటూ' ఎఫెక్ట్... రాజీనామా చేసిన కేంద్ర మంత్రి అక్బర్!
- ఈ ఉదయం నైజీరియా నుంచి వచ్చిన అక్బర్
- ఆపై ప్రధాని కార్యాలయానికి రాజీనామా?
- ఇంకా ధ్రువీకరించని పీఎంఓ
తన వద్ద పనిచేస్తున్న జర్నలిస్టులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నైజీరియా పర్యటనలో ఉన్న ఆయన, ఈ ఉదయం ఇండియాకు తిరిగి వచ్చి, ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆపై ప్రధాని కార్యాలయానికి అక్బర్ తన రాజీనామా లేఖను పంపించినట్టు సమాచారం. అక్బర్ రాజీనామా విషయాన్ని పీఎంఓ ధ్రువీకరించాల్సివుంది.
ఇక ఆయన్ను మంత్రివర్గంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ నేతలు అంటున్నారు. తొలుత ప్రియ రమణి అనే మహిళా జర్నలిస్టు, ఆపై ప్రేరణా సింగ్ బింద్రా, మరికొందరు మహిళా జర్నలిస్టులు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ది టెలిగ్రాఫ్, ఆసియన్ ఏజ్, ది సండే గార్డియన్ తదితర పత్రికల్లో ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అక్బర్ రాజీనామాను ఆమోదించేందుకే మోదీ మొగ్గు చూపుతారని తెలుస్తోంది.