Andhra Pradesh: సీఎం రమేశ్ ఇంట్లో హైటెక్ ఫింగర్ ప్రింట్ లాకర్లు.. తెరిచేందుకు హైదరాబాద్ రావాలని కోరిన ఐటీ అధికారులు!

  • నగరానికి పయనమైన సీఎం రమేశ్
  • సాయంత్రం 6 కల్లా హైదరాబాద్ కు వచ్చే అవకాశం
  • రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ కంపెనీతో పాటు కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. హైదరాబాద్ లోని  ఇంట్లో ఉన్న డిజిటల్ లాకర్లు తెరిచేందుకు సీఎం రమేశ్ వేలిముద్రలు తప్పనిసరి కావడంతో ఐటీ అధికారులు ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రమేశ్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ ఢిల్లీ నుంచి నగరానికి బయలుదేరారు. కాగా, సాయంత్రం 6 గంటలకల్లా రమేశ్ హైదరాబాద్ కు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీఎం రమేశ్ సమర్పించిన రిటర్నులకు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇళ్లు, ఆఫీసులతో పాటు ప్రొద్దుటూరులో ఆయన బంధువు గోవర్ధన్ నాయుడు ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఉద్యమించినందుకే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని సీఎం రమేశ్ ఇంతకుముందు ఆరోపించారు. ఎన్నిరకాలుగా హింసించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.

Andhra Pradesh
CM Ramesh
it raids
Kadapa District
Hyderabad
digital finger print lockers
  • Loading...

More Telugu News