Jayalalitha: హైకోర్టులో 'బెంగళూరు అమృత'కు చుక్కెదురు.. జయలలితే ఆమె తల్లి అనడానికి ఆధారాల్లేవన్న ధర్మాసనం!
- జయ జీవితమంతా మిస్టరీనే అన్న కోర్టు
- శోభన్‌బాబును తండ్రిగా ఎందుకు కోరడం లేదని ప్రశ్న
- ఆధారాలు సమర్పించిన తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన తల్లే అంటూ కోర్టుకెక్కిన బెంగళూరు యువతి అమృతకు కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. జయలలితే ఆమె తల్లి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. తాను శోభన్‌బాబు-జయలలితకు జన్మించానని, డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తే ఆ విషయం తెలుస్తుందంటూ అమృత గతంలో హైకోర్టును ఆశ్రయించింది.
అమృత పిటిషన్‌ను విచారించిన కోర్టు.. జయలలితను మాత్రమే తల్లిగా ప్రకటించాలని ఎందుకు కోరుతున్నారని, శోభన్‌బాబును తండ్రిగా ప్రకటించాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి వైద్యానాథన్ ఆదేశించారు.
దీంతో ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది అమృత.. జయలలిత కుమార్తె కాదనేందుకు తగిన వీడియో ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేసింది. జయలలిత కుమార్తె అమృత అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. జయలలిత జీవితమంతా మిస్టరీగానే మిగిలిపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.