mj akbar: తమను వాడుకునే అవకాశాన్ని మహిళా జర్నలిస్టులు ఎవరికీ ఇవ్వరు: లతా కేల్కర్
- మహిళా జర్నలిస్టులు అమాయకులు కాదు
- 'మీ టూ' ఉద్యమాన్ని స్వాగతిస్తున్నా
- ఎంజే అక్బర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలనే విషయంపై మాట్లాడను
మన దేశంలో ఇప్పుడు 'మీ టూ' ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సినీ మహిళా ఆర్టిస్టులతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు నిర్భయంగా చెప్పుకుంటున్నారు. దీంతో పెద్దల ముసుగులో లైంగిక దాడులకు యత్నించిన వారంతా ఇప్పుడు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి నెలకొంది.
కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పై కూడా లైంగిక ఆరోపణలు రావడం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. తన పట్ల అక్బర్ ఇబ్బందికరంగా ప్రవర్తించారంటూ ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించారు. దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు లతా కేల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'మీ టూ' ఉద్యమాన్ని స్వాగతిస్తున్నానని చెప్పిన ఆమె... మహిళా జర్నలిస్టులు అంత అమాయకులు కాదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమను వాడుకునే అవకాశం వారు ఇతరులకు ఇవ్వరని అన్నారు. అక్బర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ అంశంపై తాను మాట్లాడబోనని చెప్పారు.