Venkaiah Naidu: చంద్రబాబు, కేసీఆర్‌లే అందుకు నిదర్శనం!: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- మాతృభాష గొప్పదనాన్ని వివరించిన వెంకయ్య
- ఇంగ్లిష్‌లో చదువుకోని మోదీ ప్రధాని అయ్యారు
- కాన్వెంటులో చదువుకోని తాను ఉపరాష్ట్రపతిని అయ్యానన్న వెంకయ్య
మాతృభాష గొప్పతనాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోమారు వివరించారు. మాతృభాషలో చదువుకున్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావులు నిరూపించారని వెంకయ్యనాయుడు తెలిపారు. నేటి తరం పిల్లలు మమ్మీ, డాడీ పిలుపునకు అలవాటు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుకపై నుంచి వచ్చే మమ్మీ పిలుపును వదిలిపెట్టి గుండెల్లోంచి వచ్చే ‘అమ్మ’ మాటకు దగ్గరవాలని సూచించారు. ‘అమ్మ’ పిలుపులో ఆత్మీయత ఉందని చెప్పుకొచ్చారు. తాను కాన్వెంటులో చదువుకోకపోయినా ఉపరాష్ట్రపతిగా ఉన్నానని, ఇంగ్లిష్‌లో చదువుకోని మోదీ దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కాన్వెంటులో చదువుకోకున్నా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వివరించారు. కాబట్టి మాతృభాష గొప్పదనాన్ని గుర్తించాలని వెంకయ్యనాయుడు కోరారు.