banks: ఏటీఎం నుంచి విత్ డ్రాకు పరిమితులు...ఒక్కో కార్డుకి ఒక్కోలా!
- బ్యాంకుల వారీగాను వేర్వేరు డ్రా పరిమితులు
- ఎక్కువ మొత్తం తీసుకునేందుకు అంగీకరిస్తున్న ప్రైవేటు బ్యాంకులు
- రూ.3 లక్షలు అనుమతిస్తున్న యాక్సిస్ బ్యాంక్
ఏటీఎం నుంచి ఒక రోజు విత్‌డ్రాపై ఒక్కో బ్యాంకు ఒక్కోపరిమితిని అనుమతిస్తున్నాయి. అలాగే కార్డు రకాన్ని బట్టి కూడా విత్‌డ్రా చేసుకునే డబ్బు మొత్తం మారుతోంది. ఎస్‌బీఐ కొన్ని కార్డులకు రోజుకి రూ.20 వేలు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుండగా, కొన్ని కార్డులకు అత్యధికంగా లక్ష వరకు అనుమతిస్తోంది.
ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు కూడా రూ.లక్ష వరకు, యాక్సిస్ బ్యాంక్ రూ.3 లక్షల వరకు అనుమతిస్తున్నాయి. ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డు పరిమితిని రూ.40 వేల నుంచి రూ.20 వేలకు తగ్గించింది. గ్లోబల్ ఇంటర్నేషనల్ కార్డుకు రూ.50 వేలు, ప్లాటినం ఇంటర్నేషనల్ కార్డుకు రూ.లక్ష తీసుకోవచ్చని చెబుతోంది.
ఐసీఐసీఐ బ్యాంకు కనీస విత్‌డ్రా పరిమితిని రూ.50 వేల వద్ద కొనసాగిస్తోంది. స్మార్ట్ షాపర్స్ గోల్డ్ కార్డు హోల్డర్లు రూ.75 వేలు, టైటానియం డెబిట్ కార్డు హోల్డర్లు లక్ష తీసుకోవచ్చని సూచిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్లాటినం కార్డుకు రూ.50వేలు, క్లాసిక్ కార్డుకు రూ.25 వేలు అనుమతిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండీ డెబిట్ కార్డు నుంచి రూ.3 లక్షలు అత్యధికంగా తీసుకునేందుకు అనుమతిస్తోంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ టైటానియం చిప్ బేస్డ్ డెబిట్ కార్డు నుంచి రూ.లక్ష వరకు, రాయల్ డెబిట్ కార్డు నుంచి రూ.75 వేలు, ఈజీ షాప్ డెబిట్ కార్డు నుంచి 25 వేలు అనుమతిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్లాసిక్ కార్డుపై రోజుకి రూ.25 వేలు, మాస్టర్ ప్లాటినం కార్డుపై రూ.50వేలు, వీసా ఎలక్ట్రాన్ కార్డుపై రూ.25 వేలు, మాస్టర్ క్లాసిక్ కార్డుపై రూ.25 వేలు, వీసా ప్లాటినం చిప్ కార్డుపై లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.