Hyderabad: మద్యం మత్తులో బార్‌లో వీరంగమేసిన హైదరాబాద్ పోలీసులు.. బోడుప్పల్‌లో కలకలం
- బార్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ
- స్థానికులు సముదాయించినా వినిపించుకోని వైనం
- బార్ మూసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడి
హైదరాబాద్ శివారు బోడుప్పల్‌లోని ఓ బార్‌లో మంగళవారం రాత్రి పోలీసులు వీరంగమేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూటుగా తాగి యువకుల మీదకు వెళ్లారు. పోలీసుల దెబ్బ ఎలా ఉంటుందో చూస్తావా? అంటూ పైపైకి వెళ్లారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్ ఎస్సై కుమారస్వామి, సెంట్రల్ జోన్ ఎస్‌బీలో పనిచేసే ఉపేందర్, నారపల్లిలో ఉండే రైల్వే ఉద్యోగి యాదిగిరి స్నేహితులు.
మంగళవారం రాత్రి కుమారస్వామి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ స్నేహితులతో కలిసి బోడుప్పల్‌లోని ఓ బార్‌లో మద్యం తాగారు. ఆ పక్కనే మరో టేబుల్‌పై బోడుప్పల్‌లోని ఆంజనేయనగర్‌కు చెందిన నరేందర్, భరత్‌రెడ్డి, శివ తాగిన మైకంలో గొడవ పడ్డారు. ఇది చూసిన కుమారస్వామి గొడవెందుకంటూ వారిని మందలించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఎంతమంది సర్ది చెప్పినా వినకుండా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో స్థానికులు కలగజేసుకున్నారు. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోని వారు బార్ మూసేంత వరకు అక్కడే ఉండి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. అనంతరం ఇరు వర్గాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.