Payakarao Pet: పాయకరావుపేటలో.. తెలుగు తమ్ముళ్లు, నందమూరి ఫ్యాన్స్ మధ్య 'అరవింద సమేత' చిచ్చు!

  • ఇటీవల వైసీపీలో చేరిన బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు
  • అతనికి టికెట్లు ఇవ్వరాదని మేనేజర్ కు ఆదేశాలు
  • ప్లెక్సీలు, బ్యానర్లు చింపేసి నిరసన
  • పాయకరావుపేటలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' ఈ ఉదయం విడుదలవుతుండగా, నందమూరి అభిమానుల్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఉన్నారని, వారికి టికెట్లు ఇవ్వరాదని తెలుగుదేశం నేతల నుంచి నక్కపల్లి, పాయకరావుపేట థియేటర్ యజమానులకు ఆదేశాలు అందాయన్న వార్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

పాయకరావుపేటలోని సాయిమహల్ థియేటర్ లో సినిమా విడుదలవుతుండగా, బాలకృష్ణ ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉండగా, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను ఇటీవల వైసీపీలో చేరారు. ఈ సినిమా టికెట్ల కోసం వారు థియేటర్ వద్దకు వెళ్లగా, టికెట్లు ఇవ్వలేమని, ఈ మేరకు ఎమ్మెల్యే నుంచి ఆదేశాలు వచ్చాయని మేనేజర్ చెప్పినట్టు తెలుస్తోంది.

దీంతో ఆగ్రహానికి లోనైన వారు, థియేటర్ ముందు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను చించివేసి నిరసన తెలిపారు. పార్టీలు వేరైనా తాము బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులమేనని, వేలు ఖర్చు చేసి ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన తమకు టికెట్లు ఇవ్వకుండా రాజకీయాలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. థియేటర్ వద్ద పరిస్థితి శ్రుతిమించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, అభిమానులను అదుపు చేశారు.

Payakarao Pet
Nandamuri Fans
NTR
Aravinda Sametha
  • Loading...

More Telugu News