Chandrababu: ఏపీకి అన్యాయం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయి: సీఎం చంద్రబాబు

  • ఏపీకి ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్నారు!
  • విభజన వల్ల నష్టపోయినా వెనుకడుగు వేయలేదు
  • వైసీపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు

ఏపీకి అన్యాయం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఈరోజు పర్యటిస్తున్నారు. గుమ్మగట్టు మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భైరవానితిప్ప వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీటీ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం, ప్రాజెక్ట్ పైలాన్ ని ఆవిష్కరించారు. అనంతపురం జిల్లాలో లక్ష నీటి కుంటలు పూర్తయిన సందర్భంగా లక్షవ నీటికుంటను చంద్రబాబు సందర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్రం పరిష్కరించలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మపోరాటాన్ని సాగిస్తున్నానని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని, ఖాతాల్లో వేసిన నిధులను ఎక్కడైనా వెనక్కితీసుకుంటారా? అని ప్రశ్నించిన చంద్రబాబు, ఏపీకి ఇచ్చిన నిధులను ఎన్డీయే ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వెనక్కి తీసుకుందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదని, పట్టుదల, సంకల్పంతో ముందుకెళ్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? నన్ను విమర్శించే వైసీపీ నేతలకు మోదీ కనిపించట్లేదా?’ అని ప్రశ్నించారు. నరేంద్రమోదీ ఆడించినట్టు జగన్, పవన్ కల్యాణ్ లు ఆడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News