Diamond: వజ్రం దొరికింది... తెల్లారేసరికి కోటీశ్వరుడైన కూలీ!
- మధ్యప్రదేశ్, పన్నా జిల్లాలో కూలీ పనులు చేసే మోతీలాల్
- పొలంలో తవ్వుతుండగా కనిపించిన 42.9 క్యారెట్ల వజ్రం
- వేలం వేసి ఆ డబ్బు అతనికిస్తామన్న అధికారులు
మధ్యప్రదేశ్ పరిధిలోని పన్నా జిల్లాలో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడో కూలీ. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మోతీలాల్ ప్రజాపతి అనే కూలీ, పొలంలో గుంత తవ్వుతుండగా, 42.9 క్యారెట్ల వజ్రం దొరికింది. ఇంత క్వాలిటీ ఉన్న వజ్రం లభించడం చాలా విశేషమని చెప్పిన జిల్లా అధికారి సంతోష్ సింగ్, దీని విలువ కోటిన్నర వరకూ ఉంటుందని చెప్పారు.
1961లో ఇదే ప్రాంతంలో 44.55 క్యారెట్ల వజ్రం లభించిందని గుర్తు చేశారు. దీన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ పోను, మిగిలిన మొత్తాన్ని మోతీలాల్ కు అందిస్తామని చెప్పారు. కాగా, అప్పులతో బాధపడుతున్న తనకు ఈ వజ్రం ఎంతో మేలు చేస్తుందని, పిల్లలను బాగా చదివించుకుంటానని మోతీలాల్ వ్యాఖ్యానించాడు. ఈ వజ్రం తనకు నెల రోజుల ముందే దీపావళిని తెచ్చిపెట్టిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.