Sharukh khan: మలాలా ట్వీట్‌కి కరిగిపోయిన షారుఖ్!
- తమ వర్సిటీకి తీసుకురావాలనుకున్న ప్రిన్సిపల్
- నవంబరు 29, 2016లో ట్వీట్
- అదే ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన మలాలా
- అతి త్వరలోనే వస్తానన్న షారుఖ్
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ట్విటర్‌లో చేసిన చిన్న విన్నపానికి కరిగిపోయి, ఆమె కోరికను నెరవేర్చేందుకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సిద్ధమయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన 'లేడీ మార్గరెట్ హాల్' ప్రిన్సిపల్ అలాన్ రుస్‌బ్రిడ్గెర్‌కి తమ వర్సిటీకి షారుఖ్‌ను తీసుకురావాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. తన కోరికను తెలుపుతూ ఆయన నవంబరు 29, 2016లో ట్వీట్ చేశారు. తమ వర్సిటీ విద్యార్థులకు షారుక్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే అదే విన్నపాన్ని ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన 'లేడీ మార్గరెట్ హాల్'లో విద్యనభ్యసిస్తున్న మలాలా రీ ట్వీట్ ద్వారా తెలిపారు. తమ ప్రిన్సిపల్ అప్పట్లో చేసిన ట్వీటుని రీట్వీట్ చేసిన మలాలా... ‘మేము ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కి వెంటనే స్పందించిన షారుఖ్ విద్యార్థులతో మాట్లాడడం అంటే తనకు కూడా చాలా ఇష్టమని, వారితో సమావేశం కావడం తనకు గర్వకారణమేనని ట్వీట్ చేశారు. ఇందుకోసం త్వరలోనే వస్తానని తెలిపారు. దీంతో వర్సిటీ విద్యార్థులు, మలాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు.