HCL: ఏపీకి వస్తున్న హెచ్‌సీఎల్.. నేడు కేసరపల్లిలో మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన!
- నేటి మధ్యాహ్నం 3 గంటలకు భూమి పూజ
- తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడి
- వచ్చే పదేళ్లలో 7500 మందికి ఉద్యోగావకాశాలు
నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఐటీ మంత్రి నారా లోకేశ్ నేటి మధ్యహ్నం మూడు గంటలకు భూమి పూజ నిర్వహించనున్నారు. హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ కుమార్తె, సంస్థ సీఈవో రోషిని నాడార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇప్పటికే నోయిడా కేంద్రంగా సేవలు అందిస్తున్న హెచ్‌సీఎల్ ఇప్పుడు ఏపీకి కూడా విస్తరించింది. రెండు విడతల్లో మొత్తం రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు హెచ్‌సీఎల్ తెలిపింది. ఫలితంగా వచ్చే పదేళ్లలో 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపింది. తొలి దశలో రూ.400 కోట్లతో 28 ఎకరాల విస్తీర్ణంలో భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొంది. దీనిని ఏడాదిలోపే పూర్తి చేస్తామని తెలిపింది.
రెండో దశలో అమరావతిలో 20 ఎకరాల్లో కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసంరూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించింది. ఐదేళ్లలో 3500 మందికి, పదేళ్లలో 7500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.
మొత్తం 41 దేశాల్లో ఐటీ సేవలు అందిస్తున్న హెచ్‌సీఎల్‌లో ప్రపంచవ్యాప్తంగా 1.24 లక్షల మంది ఉద్యోగులున్నారు. హెచ్‌సీఎల్ భాగస్వామ్య కంపెనీ స్టేట్ స్ట్రీట్ గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది.