Rahul Gandhi: త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్
- కార్యకర్తల అత్యుత్సాహంతో పెను ప్రమాదం
- హారతిచ్చే సమయంలో పెద్ద మంట
- భద్రతా ఏర్పాట్లలో లేపాలు లేవన్న ఎస్పీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటనలో భద్రతా లోపం మరోసారి వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేడు జబల్‌పూర్‌లోని ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా జరిగిన పెను ప్రమాదం నుంచి రాహుల్ త్రుటిలో తప్పించుకున్నారు. తమ అధినేతకు హారతివ్వాలని కార్యకర్తలు హారతి పళ్లేలతో వరుసగా నిలబడ్డారు. అక్కడే ఉన్న మరికొందరు కార్యకర్తల చేతుల్లో గ్యాస్ నింపిన బెలూన్లున్నాయి.
హారతిచ్చే సమయంలో దీపాలు ఒక్కసారిగా బెలూన్లకు అంటుకోవడంతో పెద్ద మంట చెలరేగింది. అయితే అది వెంటనే ఆరిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంటలు వెంటనే ఆరినా, ప్రాణభయంతో జనం పరుగులు తీయడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఓపెన్ టాప్ జీప్‌లో రాహుల్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కమల్ నాథ్ కూడా ఉన్నారు. ‘అక్కడున్నవారంతా కాంగ్రెస్ కార్యకర్తలే. నిబంధనల ప్రకారం 15 మీటర్ల దూరాన్ని పాటించాం. ఎటువంటి లాఠీ ఛార్జి జరగలేదు’ అని ఎస్పీ అమిత్‌సింగ్ వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలున్నాయన్న విమర్శను ఆయన కొట్టిపారేశారు.