Karnataka: 3వ నంబర్ ఇల్లు.. పేరు వినగానే వణుకుతున్న సీఎం కుమారస్వామి, యడ్యూరప్ప!
- ఇంట్లో దిగేందుకు ససేమిరా అంటున్న నేతలు
- తీవ్రమైన వాస్తుదోషం ఉందని భయం
- గతంలో పదవి కోల్పోయిన కుమారస్వామి
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కోరకమైన విశ్వాసాలు ఉంటాయి. కొందరు మంగళవారం కొత్త పనిని మొదలుపెట్టరు. పౌర్ణమి రోజు పుట్టింటికి, అమావాస్య రోజు అత్తింటికి వెళ్లకూడదని నియమాలు పెట్టుకుంటారు. ఇంకొందరు వాస్తును బలంగా నమ్ముతారు. తాజాగా కర్ణాటకలో అలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వానికి చెందిన ఓ భవంతిలో నివాసం ఉండేందుకు మాజీ సీఎం, బీజేపీ నే యడ్యూరప్ప, సీఎం కుమారస్వామి వణికిపోతున్నారు. ఇంతకూ అందులో దయ్యమో, భూతమో ఉందనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నేతలంతా భయపడుతున్నది కేవలం వాస్తు దోషం కారణంగానే.
బెంగళూరులోని కుమారకృపా అతిథి గృహంలోని 3వ నెంబరు భవనం వాస్తు దోషానికి కేరాఫ్ గా మారిందని నేతలు భయపడుతున్నారు. గతంలో కుమారస్వామి సీఎంగా ఈ భవంతిలో దిగారనీ, ఆ తర్వాత పదవిని కోల్పోవడంతో పాటు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారనీ అంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ప్రతిపక్ష నేత యడ్యూరప్పకు ఈ భవనాన్ని కేటాయించింది. దీంతో దాంట్లోకి వెళ్లేందుకు యడ్డీ ససేమీరా అంటున్నారు. రేస్ కోర్సు కాటేజీలో ఓ భవనాన్ని తనకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కేవలం యడ్డీనే కాదు కుమారస్వామి కూడా ఈ ఇంటికి కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి కూడా గతంలో ఎదురైన అనుభవం దృష్ట్యా జేపీ నగర్ లోని తన నివాసంలోనే ఉంటున్నారు. తాజాగా ఈ ఇంటిని ప్రస్తుతం మంత్రి మహేశ్ కు కేటాయించారు.