Tirumala: ఈ నెల 10 నుంచి తొమ్మిది రోజుల పాటు తిరుమలలో సామాన్యులకు గదులు నిల్!
- ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- 14న గరుడ సేవ, 15న పుష్పక విమాన సేవ
- చక్ర స్నానంతో ఉత్సవాల ముగింపు
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వరకూ జరగనున్నాయి. ఈ నెల 9న ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 14న గరుడసేవను నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు అంటే ఈ నెల 15న పుష్పక విమాన సేవను నిర్వహిస్తారు. ఆ తర్వాత 17న స్వర్ణ రథోత్సవం, 18న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలలో గదులు నిండిపోనున్నాయి. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు గదులను కేటాయించరు. తిరుమలలో భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు స్వామివారికి సేవ చేసుకునేందుకు రావడంతో వారికి రెండ్రోజుల పాటు గదులను టీటీడీ అధికారులు కేటాయిస్తారు. ఇక గరుడసేవ సమయంలో వీవీఐపీల తాకిడి పెరిగిపోవడంతో భవన నిర్మాణ దాతలకు సైతం గదులు దొరకని పరిస్థితి నెలకొంటుంది.