America: రష్యాతో లావాదేవీలు రద్దు చేసుకోకుంటే ఇబ్బందుల్లో పడతారు: భారత్‌ను హెచ్చరించిన అమెరికా
- ‘క్యాట్సా’ భారత్‌పై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరిక
- అంత భయపడాల్సిన అవసరం లేదంటున్న విశ్లేషకులు
- ఎస్-400 విషయంలో రష్యాతో ఒప్పందం ఖరారయ్యే అవకాశం
రష్యాతో లావాదేవీలను రద్దు చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారంటూ భారత్‌ను అమెరికా హెచ్చరించింది. గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు రష్యా నుంచి ‘ఎస్-400’ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రష్యాతో ‘గణనీయ స్థాయిలో’ వ్యాపారం నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా ‘కౌంటరింగ్ అమెరికాస్ ఆడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్’ (క్యాట్సా) పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాలతో గణనీయ స్థాయిలో వ్యాపారం నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. రష్యా నుంచి చమురు, సహజ వాయు పరిశ్రమ, రక్షణ, భద్రతా రంగాలను ఆంక్షలకు లక్ష్యంగా ఎంచుకుంది.
మిలియన్ డాలర్ల విలువైన ఎస్-400 రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అమెరికా తాజా హెచ్చరికలు చేసింది. ‘క్యాట్సా’ పరిధిలోకి వచ్చే అన్ని లావాదేవీలపైనా ఆంక్షలు ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ మిత్ర పక్షాలను, భాగస్వామ్య దేశాలను ఈ విషయంలో మరోమారు ఆలోచించాల్సిందిగా కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ‘ఎస్-400’ విషయంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా హెచ్చరికలను విశ్లేషకులు కొట్టిపడేశారు. ‘ఎస్-400’ విషయంలో భారత్ ముందుకెళ్లినా అమెరికా చేసేదేమీ ఉండదని, ప్రకటనలకు, హెచ్చరికలకే అది పరిమితమవుతుందని చెబుతున్నారు.