Tamilnadu: మరోసారి కేరళను ముంచెత్తనున్న వరదలు... తమిళనాడుకు కూడా!

  • గత మూడు రోజులుగా భారీ వర్షాలు
  • నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం
  • లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు ప్రారంభం
  • తమిళనాడులో ఐదు జిల్లాల పాఠశాలలకు సెలవులు

కేరళలోని పర్వత ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే నిండివున్న రిజర్వాయర్లు, నదులలోకి మరింతగా నీరు వస్తుండటంతో కేరళతో పాటు తమిళనాడుకు వరదముప్పు పొంచివుంది. రెండు రాష్ట్రాలకూ రెడ్ అలర్ట్ ప్రకటించిన కేంద్రం, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు, నదీ పరీవాహక ప్రాంతాల సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

కాగా, గడచిన మూడు రోజుల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఐదు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కోయంబత్తూరు, కాంచీపురం, కన్యాకుమారి, చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నీలగిరి, ఊటీ ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు.

కేరళలోని పెరియార్ సహా ఇతర నదీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని, నదుల్లో నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News