Chandrababu: గుప్పెట మూసి ఉన్నంత వరకే మర్యాద.. కేసీఆర్‌లా తిట్టడం నాకు చేతకాదు!: టీఆర్ఎస్ అధినేత తిట్ల దండకంపై చంద్రబాబు

  • సిద్ధాంతాలు, విధానాలపైనే మాట్లాడతా
  • ముందు అనేసి తర్వాత నాలుక్కరుచుకోను
  • మర్యాద పోగొట్టుకోవద్దు

నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను తిట్టడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. తిరుపతి పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తననెందుకు తిడుతున్నారో, తాను చేసిన తప్పేంటో తెలియడం లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడడమే తాను చేసిన తప్పా? అని నిలదీశారు. తెలుగు ప్రజలు సామరస్యంగా ఉండాలనుకోవడమే తన తప్పా? అని ప్రశ్నించారు.

తాను కేసీఆర్‌లా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడనని, విధానాలు, సిద్ధాంతాలపైనే మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా, పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. తనకో వ్యక్తిత్వం ఉందని, దానిని కాపాడుకుంటానని పేర్కొన్నారు. ఏదంటే అది అనేసి తర్వాత నాలుక్కరుచుకునే అలవాటు తనకు లేదన్న చంద్రబాబు.. గుప్పెట మూసి ఉన్నంత వరకే మర్యాద అని అన్నారు.

 హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లేనని కేసీఆరే పలుమార్లు చెప్పారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. తెలుగు వారి కోసం హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని వారే అనుభవిస్తున్నారని అన్నారు. 2009 ఎన్నికల ప్రచార సభల్లో తనను ఎలా పొగిడారో కేసీఆర్ ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.

 అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణను ఎందుకు వదిలి వెళ్లాలని కేసీఆర్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. వేలమందికి రాజకీయ భవిష్యత్తు అందించిన టీడీపీ ఉనికిలో ఉండకూడదనడం సరికాదన్నారు. బీజేపీ-టీడీపీ కలిసి ఉన్నప్పుడు టీఆర్ఎస్-వైసీపీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశాయని, మరి ఇదేం నైతికతో చెప్పాలని నిలదీశారు. తాము బీజేపీతో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ కూడా కోరిందన్న చంద్రబాబు.. బీజేపీ నుంచి బయటకు రాగానే కేసీఆర్, జగన్, పవన్ కలిసి తమను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News