Telangana: తెలంగాణ ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లండి.. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచన!
- సుప్రీంకోర్టు తలుపు తట్టిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి
- 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపణ
- అన్ని పిటిషన్లను రేపే విచారించాలని హైకోర్టుకు సూచన
తెలంగాణలో బోగస్ ఓట్లను తొలగించకుండా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాలని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కు సూచించింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాల్సి వస్తే.. ఆ అధికారం హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో దాదాపు 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయనీ, వీటిని తొలగించకుండా ఎన్నికలకు వెళుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. ఈ ఓట్ల వ్యవహారం తేలేవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఓటర్ జాబితా సవరణకు సోమవారం వరకే గడువు మిగిలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. రేపు మధ్యాహ్నం 4 గంటలలోపు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లను రేపే విచారించాలని సుప్రీం హైకోర్టును ఆదేశించింది.