sexual herassment: ఇంటర్‌ విద్యార్థినిపై కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులు.. నిర్భయ చట్టం కింద కేసు!

  • ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ బెదిరింపులు
  • అసభ్యకర దృశ్యాలు రికార్డు చేసి వేధింపులు
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద కేసు నమోదు

ఇంటర్‌ విద్యార్థినిపై ఓ  కారు డ్రైవర్‌ అత్యాచార యత్నం చేశాడు. భయపడిన బాలిక గట్టిగా అరవడంతో వదిలేశాడు. అనంతరం ఇంట్లోగాని, బయట వారికిగాని ఆ విషయం చెబితే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. కూతురి ప్రవర్తనతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మెల్లగా ఆరాతీయగా తమ కారు డ్రైవర్‌ నిర్వాకం ఆమె బయటపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 పోలీసులు తెలిపిన వివరాల మేరకు...హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వద్ద షేక్‌ ఇస్మాయిల్‌ (25) రెండేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కుమార్తె (15) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఆమెపై గత కొంతకాలంగా ఇస్మాయిల్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఓసారి బాలికను కారులో తెస్తుండగా ఆమె ఒక్కతే ఉండడం చూసి ఎవరూలేని ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఆమెపై లైంగికదాడి యత్నం చేశాడు.

ఇస్మాయిల్‌ చేష్టలతో భయపడి పోయిన బాలిక గట్టిగా అరవడంతో వదిలేశాడు. కానీ ఆ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల ఆ బాలిక బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి వీడియో కాల్‌ చేశాడు. ఆమె పెంపుడు కుక్కపిల్ల మెడపై కత్తిపెట్టి, బాలికను దుస్తులు విప్పాలని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక అతను చెప్పినట్లే చేసింది.

దీన్ని రికార్డు చేసిన ఇస్మాయిల్‌ తాను చెప్పినట్లు వినకుంటే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం వారికి చెప్పింది. వారు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News