Andhra Pradesh: డిమాండ్లు నెరవేర్చాలంటూ.. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ మహిళా అధ్యాపకుల నిరవధిక దీక్షలు!
- ఉద్యోగ భద్రత డిమాండ్‌తో 8, 9 తేదీల్లో నిరవధిక దీక్షకు నిర్ణయం
- విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన
- ఇప్పటికే పోస్టుకార్డు, ట్విట్టర్ల ద్వారా నిరసన
ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మహిళా అధ్యాపకులు నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఇప్పటికే పలు రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్న అధ్యాపకులు నిరవధిక దీక్షతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు.
విజవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈనెల 8, 9 తేదీల్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘మా ఆందోళనలో భాగంగా ఇప్పటికే గత నెల 26, 27 తేదీల్లో పోస్టు కార్డు ఉద్యమం, 29న, అక్టోబర్ 1న ట్విట్టర్ ఎస్‌ఎంఎస్‌లు, అక్టోబర్ 2న అన్ని కలెక్టరేట్‌ల వద్ద సత్యాగ్రహం నిర్వహించాం. 3 నుంచి నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై నిరసన తెలియజేస్తున్నాం. శుక్రవారం వరకు ఈ నిరసన కొనసాగుతుంది. ప్రభుత్వం అప్పటికీ మా డిమాండ్లపై స్పందించకుంటే నిరాహార దీక్షతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయాకర్, కృష్ణంరాజు తెలిపారు.