MVVS Murthy: ఎంవీవీఎస్ మూర్తిని ఇంకా గుర్తించని అమెరికా అధికారులు... అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ లో మృతదేహం!
- ఒక్క మృతదేహానికే పోస్టుమార్టం
- ప్రమాద సమయంలో వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను దగ్గరుంచుకోని మూర్తి
- హోటల్ కు వెళ్లి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోనున్న అధికారులు
నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) అలస్కాలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతదేహం ఇప్పుడు అలస్కా స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉంది. ఈ కేసును విచారిస్తున్న వాస్మన్, బ్రియాన్ హేలి అనే పోలీసు అధికారులు, డిటెక్టివ్ జారెడ్ ఫిషర్ ఇంకా మూర్తిని గుర్తించలేదు.
ఆయన దగ్గర వ్యక్తిగత గుర్తింపు పత్రాలేవీ లేకపోవడంతోనే సమస్య ఏర్పడిందని తానా అధ్యక్షుడు సతీశ్ వేమన వ్యాఖ్యానించారు. వారు బసచేసిన హోటల్ కు వెళ్లి ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న తరువాతే మూర్తిని గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఒక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందని, మిగతా మూడు మృతదేహాలకూ నేడు పోస్టుమార్టం (అమెరికా కాలమానం ప్రకారం రేపు) జరుగుతుందని ఆయన చెప్పారు. మృతుల ఐడెంటిఫికేషన్ సమస్యగా మారకుండా చూసేందుకు తానా తరఫున సహకారాన్ని అందిస్తున్నామని, మృతదేహాలు ఇండియాకు ఎప్పుడు పంపాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ధారణకూ రాలేదని తెలిపారు.